చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972) సంగీతం: టి.చలపతిరావు నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి, కృష్ణం రాజు, కాంచన, అంజలీదేవి , గీతాంజలి అసోసియేట్ డైరెక్టర్: ఎ.కోదండ రామిరెడ్డి దర్శకత్వం: వి.మధుసూదనరావు నిర్మాత: యస్.యస్.బాలన్ విడుదల తేది: 1972
Songs List:
పదరా ! పదరా! పాట సాహిత్యం
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: పదరా ! పదరా! నడుంకట్టి పిడికిలెత్తి పదరా నవ విప్లవ శంఖమూది పదరా పడగెత్తే స్వార్థపరుల అడుగడున తరిమికొట్టి పదరా మంచిరోజు లొచ్చాయి పదరా చరణం: 1 కలిగినోళ్ళ జులుములింక సాగవురా ! వాళ్ళ దోపిడీలు, దురంతాలు చెల్లవురా కార్మికులు - కర్షకులు, పీడితులు, తాడితులు సంకెళ్ళను తెంచుకు సాగాలిరా మంచిరోజు లొచ్చాయి పదరా చరణం: 2 ఒళ్ళువంచి పని చేయని వాళ్లు ! పరుల నోళ్ళు కొట్టి బతికే గొప్పోళ్ళు పెట్టెలో దాచుకున్న పుట్టెడు ధన రాసులను పదుగురికి పంచుదాము పదరా సమభావం పెంచుదాము పదరా మంచిరోజు లొచ్చాయి పదరా
సిరిపల్లె చిన్నది పాట సాహిత్యం
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: సిరిపల్లె చిన్నది చిందులు వేస్తున్నది చిన్నగాలి తాకిడికే చిర్రుబుర్రుమన్నది ఓయమ్మో - భయమేస్తున్నది చరణం: 1 మొన్న మొన్న ఈ పల్లెటూరిలో పుటిన బుజ్జాయి నిన్నటిదాకా పరికిణి కట్టి తిరిగిన పాపాయి బస్తీ మకాము పెట్టి -- బడాయి నేర్చుక వచ్చి బుట్టబొమ్మలా గౌను వేసుకొని పోజులుకొడుతూ ఉన్నది చరణం: 2 ఇప్పుడిప్పుడే లండను నుండి దిగింది దొరసాని వచ్చీరానీ ఇంగిలీసులో దంచుతోంది రాని రేగిందంటే ఒళ్ళు పంబ రేగేనంట అబ్బ తా చుపాములా పడగ విప్పుకొని తై తై మన్నది చరణం: 3 సిగ్గే తెలియని చిలిపి కళ్ళకు నల్లని అద్దాలెందుకు తేనెలు చిలికే తెలుగు ఉండగా ఇంగిలీసు మోజెందుకు నోరు ముచిదైనప్పుడు ఊరు మంచిదే ఎప్పుడు తెలుసుకోలేని బుల్లెమ్మలకు - తప్పవులే తిప్పలు
ఎగిరే గువ్వ ఏమంది ? పాట సాహిత్యం
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల పలవి: ఎగిరే గువ్వ ఏమంది ? విసిరే గాలి ఏమంది ? ప్రకృతిలోన స్వేచ్ఛకన్న మిన్న లేనే లేదంది చరణం: 1 పూల కెందుకు కలిగెనే ఈ ఘుమ ఘుమలు ఈ మధురిమలు తీగ లెన్నడు నేర్చెనే ఈ అల్లికలు ఈ అమరికలు స్వేచ్ఛకోరే మనసువుంటే పొందలేనిది యేముంది చరణం: 2 కోకిలెన్నడు నేర్చెనే ఈ సరిగమలు సరాగములు నెమలి కెవ్వరు నేర్పిరే ఈ లయగతులు ఈ స్వరజతులు స్వేచ్ఛకోరే మనసువుంటే నేర్వలేనిది యేముంది చరణం: 3 శిరసు వంచక నిలువనా గుడి గోపురమై గిరి శిఖరమునై అవధులన్నీ దాటనా ప్రభంజనమై జలపాతమునై స్వేచ్ఛకోరే మనసునాది ఇంక నా కెదురేముంది
ఈ నాటి సంక్రాంతి అసలైన పండగ పాట సాహిత్యం
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల అండ్ కోరస్ సాకి ! ఏటేటా వస్తుంది సంక్రాంతి పండగ బీదసాదల కెల్ల ప్రియమైన పండగ పల్లవి: ఈ నాటి సంక్రాంతి అసలైన పండగ సిసలైన పండగ కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండుగ! ఎవ్వరేమి అనుకున్నా ఎంత మంది కాదన్నా ఉన్న వాళ్ళ పెత్తనం ఊడుతుందిలే సోషలిజం వచ్చే రోజు - దగ్గరుందిలే చరణం: 1 గుడిసె కాపురాలు మాకు ఉండబోవులే ఈ మేడలు కొద్ది మందికే స్థిరము కావులే ఓడలు బండ్లై బండ్లు ఓడలై తారుమారు ఎపుడైనా తప్పదులే తప్పదులే చరణం: 2 ఎగిరిపడే పులిబిడ్డలు పాపం ఏమైపోతారు పిల్లులాగా తోక ముడుచుకొని మ్యావ్ మ్యావ్ మంటారు కిక్కురుమనక - కుక్కిన పేనై చాటుగా నక్కుతారు - చల్లగా జారుకుంటారు
నేలతో నీడ అన్నది పాట సాహిత్యం
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: దేవులపల్లి గానం: ఘంటసాల పల్లవి : నేలతో నీడ అన్నది నను తాకరాదని పగటితో రేయి అన్నది నను తాకరాదని నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది చరణం: 1 వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా చల్లగాలి తాకనిదే నల్ల మబ్బు కురిసేనా ? తల్లి తండ్రి ఒకరి నొకరు తాకనిదే నీవు లేవు, నేను లేను, లోకమే లేదులే చరణం: 2 రవి కిరణం తాకనిదే నవ కమలం విరిసేనా మధుపం తను తాకనిదే మందారం మురిసేనా మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే మమత లేదు, మనిషి లేడు, మనుగడయే లేదులే చరణం: 3 అంటరాని తనము- ఒంటరి తనము అనాదిగా మీ జాతికి అదే మూలధనము ఇక సమభావం, సమధర్మం, సహజీవన మనివార్యం తెలుసుకొనుట మీ ధర్మం - తెలియకుండా మీ ఖర్మం
మంచిరోజు లొచ్చాయి పదరా పాట సాహిత్యం
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, సుశీల అండ్ కోరస్ పల్లవి: పదరా - పదరా నడుంకట్టి పిడికిలెత్తి పదరా నవ విప్లవ శంఖమూది పదరా పడగెత్తే స్వార్ధపరుల అడుగడుగున తరిమి కొట్టి - పదరా మంచిరోజు లొచ్చాయి పదరా చరణం: చెమటోడ్చి పనిచేయని సోమరులకు చోటు లేదురా పదుగురితో కలిసి రాని బాబులకిక బతుకు లేదురా గునపమెత్తి - సుత్తిపట్టి కొండలనే పిండికొట్టి నదులను మళ్ళించుదాము పదరా రతనాలను పండించుదాము పదగా మంచిరోజు కొచ్చాయి పదరా
ఎందుకే పిరికితనం పాట సాహిత్యం
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి పల్లవి : ఎందుకే పిరికితనం చాలునే కలికితనం రా - తెంచుకొని రా - తెలుసుకొని రా ! బంధనా లెందుకు - ఎందుకు - ఎందుకు చరణం: 1 పెళ్ళంటే ఒక ఒప్పందం - అది కోరేదే అనుబంధం ఆ అనుబంధం లేనినాడు మనువూ, మనసూ కలవని నాడు మంగళ సూత్రమె ఉరితాడు - ఉరితాడు - ఉరితాడు రా - తెంచుకొని రా తెలుసుకొని రా! పంజరా లెందుకు- ఎందుకు - ఎందుకు! చరణం: 2 మాంగల్యమే సతీమణి ప్రాణమందురే పసుపు, కుంకుమ పడతి సౌభాగ్యమందురే సౌశీల్యమే మగువ సహజ గుణమందురే సహనమే స్త్రీ జాతి మూలధనమందురే చరణం : 3 నువు చెప్పేది పాతపురాణం నువు మెచ్చేది కొత్త సమాజం స్వార్థపరులూ సౌఖ్యం కోసం చల్లని సూక్తులు వల్లించి జాతికి వేసిరి సంకెళ్ళు - సంకెళ్ళు - సుకెళ్ళు తెంచుకొని రా - తెలుసుకొని రా ఉక్కు తెరలెందుకు - ఎందుకు - ఎందుకు చరణం : 4 ఈ తాళి ఏ రీతి విడనాడనే ? ఎటుల ఈ సంఘాని కెదురీదనే ? పది మంది నను చూచి పకపకా నవ్వరా ! నా పేరు, నా పరువు గంగలో కలపరా? చరణం: 5 నీ నరాల నిండా పీరికి మందు అరె కలేజ వుంటే ఉరుకుముందు రాజ్యాలైనా రాకెట్లయినా రమణులు నడిపే ఈ రోజులో ఇంకా యెందుకు - వాదనలు - వేదనలు - రోదనలు రా - తెంచుకొని రా తెలుసుకొని రా భంధనాలెందుకు ఎందుకు ఎందుకు
యెక్కడికమ్మా ఈ పయనం ? పాట సాహిత్యం
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల పల్లవి: యెక్కడికమ్మా ఈ పయనం ? యేమిటి తల్లీ నీ గమ్యం? చెదరిన హృదయముతో చెమరిన కన్నులతో చరణం: 1 కన్న ఇంటిలో చోటేలేదు ఉన్న ఇంటిలో సుఖమే లేదు చిరునవ్వులతో వెలిగే బ్రతుకే చీకటి పాలై పోయెనులే చరణం: 2 తెలియక చేసిన చిన్న నేరమే కలకాలం నిను వెంటాడాలా ? మమతలు చూపి మన్నించవలసిన పతియే నీ పై పగబూనాలా ?
No comments
Post a Comment